Latest News

Friday, April 8, 2016

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రివ్యు



‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రివ్యు

TOLLY BEATS RATING: 2.75/5


కథ :
మూడు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకొని ఉన్న రత్తన్ పూర్ ప్రాంత నేపథ్యంలో నడిచే కథే ‘సర్దార్ గబ్బర్ సింగ్’. భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) అనే ఓ రాజకుటుంబానికి చెందిన నియంత రత్తన్ పూర్ ప్రాంతంలోని సహజ వనరులను అక్రమంగా చేజక్కించుకునేందుకు పన్నాగాలు పన్నుతుంటాడు. ఆ క్రమంలోనే ఎన్నో పంట భూములను అక్రమంగా సొంతం చేసుకొని ఓ ఊరినే నాశనం చేస్తాడు. ఇక అదే ప్రాంతంలో ఉండే మరో రాజకుటుంబంతో భరవ్‍కి ఓ శతృత్వం కూడా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులున్న ఊరిని చక్కబెట్టేందుకు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) పోలీసాఫీసర్‍గా నియమితుడవుతాడు. ఇక సర్దార్ ఈ భైరవ్ సింగ్ ఆటలను ఎలా కట్టించాడు? రత్తన్ పూర్‌లో అతడికి పరిచయమైన రాజ కుమారి అర్షిని (కాజల్)తో అతడి ప్రేమ ఎటువైపు దారితీసిందీ? అర్షిని కుటుంబానికి, భైరవ్ సింగ్‍కి ఉన్న గొడవలేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మొదట్నుంచీ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్‌నే మేజర్ హైలైట్‍గా చెప్పుకోవచ్చు. పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఆయన అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. పవన్, సినిమా మొత్తాన్నీ తన కామెడీ టైమింగ్‍తో భుజాలపై మోసుకొని నడిపించారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్‌లో పవన్ ప్రయత్నించిన చిరు వీణ స్టెప్, ఫస్టాఫ్‍లో వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్, కాజల్‍తో రొమాన్స్ ట్రాక్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చిపెడతాయి. ఇక కాజల్ కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. రాజకుమారిగా అందంగా కనిపించడంతో పాటు మంచి నటన కూడా కనబరిచింది. విలన్‍గా నటించిన శరద్ కెల్కర్ కూడా బాగా నటించాడు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే రత్తన్ పూర్ పరిచయంతో మొదలయ్యే సన్నివేశాలు బాగున్నాయి. అదే విధంగా పాటలన్నీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇటు మాస్, అటు క్లాస్ రెండు రకాల పాటలూ సినిమాలో మంచి రిలీఫ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. తౌబ తౌబ ఫ్యాన్స్‍కి పండగ లాంటి పాట.
మైనస్ పాయింట్స్ :
‘సర్దార్’ సినిమాకు అసలైన మైనస్ పాయింట్ అంటే ఓ స్పష్టమైన కథగానీ, ఓ ఎమోషన్ గానీ లేకపోవడం గురించే చెప్పుకోవాలి. ఇలాంటి కథలు తెలుగులో ఇప్పటికే చాలారాగా, అదే కథకు పెద్దగా ఆకట్టుకోని స్క్రీన్‍ప్లే రాసుకొని మనముందుకు వచ్చి చేసిన ఈ ప్రయత్నంలో చాలా మైనస్‍లే దొర్లాయి. కథలో స్పష్టత లేకపోవడం, ఏమాత్రం ఎమోషన్ లేకుండా కథనం సాగడం, అనవసరమైన సన్నివేశాలు, అతిగా కనిపించే యాక్షన్ సీన్స్.. లాంటివి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన లక్షణాలను పూర్తిగా పక్కనబెట్టేసి అర్థం లేని కమర్షియల్ సినిమాగా సర్దార్‍ను మిగిల్చాయి.
కథ మొదలైన కొద్దిసేపటికే సినిమా పట్టు తప్పనట్టు కనిపిస్తుంది. ఇక అక్కణ్ణుంచి ఇంటర్వెల్ వరకూ బాగానే లాక్కొచ్చినా, సెకండాఫ్‍లో మాత్రం సినిమా పూర్తిగా ట్రాక్ తప్పింది. ఇక రెండున్నర గంటలకు పైనే ఉన్న నిడివి కూడా ఈ సినిమాకు మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ బ్లాక్ ఈ స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలో ఉండాల్సిన క్లైమాక్సేనా అనేలా ఉంది. విలన్ పాత్రను మొదట్నుంచీ బలంగానే చిత్రించినా, రాన్రానూ ఆ పాత్రను పూర్తిగా పక్కదోవ పట్టించారు. నిక్కీ గిల్రాని పాత్ర ఊరికనే స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఉన్నట్లు ఉంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల విషయానికి వస్తే, అందరికంటే ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పుకోవాలి. దేవిశ్రీ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్‌లో ఒకరుగా నిలిచారు. ఆయన అందించిన ఆడియో ఇప్పటికే హిట్ కాగా, సినిమాలో విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఆ పాటలకు మరింత అందం వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ దేవిశ్రీ పనితనం బాగుంది. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రత్తన్ పూర్ నేపథ్యాన్ని ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి తనదైన సెట్స్‌తో పట్టుకుంటే, ఆర్థర్ ఆ నేపథ్యాన్ని తన కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటింగ్ పనితనం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే, పవన్ అందించిన అతిసాదా సీదా కథ, కథనాలతో బాబీ దర్శకుడిగానూ పెద్దగా చేసిందేమీ లేదు. కేవలం పవన్ చరిష్మాను మాత్రమే నమ్ముకున్న బాబీ, ఆ క్రమంలోనే కొన్ని అలాంటి సన్నివేశాలను అందించడంలో సఫలమైనా, దర్శకుడిగా మాత్రం చాలాచోట్ల నిరాశపరిచాడు. బాబీ దర్శకత్వ ప్రతిభను చూపే సన్నివేశాలు సినిమాలో పెద్దగా ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ పాత్ర చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో బాబీ ప్రతిభ చూడొచ్చు. ఇక సాయిమాధవ్ బుర్రా అందించిన మాటలు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.


తీర్పు :
పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. సరదాగా నవ్వించే కామెడీ, పవన్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవన్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లాంటివి ప్రధానంగా ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడా ఇవే అంశాలను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా చెప్పుకోవాలి. ఇక ఈ అంశాలనే ప్లస్‍లుగా నింపుకున్న ఈ సినిమాకు పవన్ చరిష్మానే అతిపెద్ద హైలైట్. వినడానికి, చూడడానికి బాగున్న పాటలు, పవన్-కాజల్‍ల కెమిస్ట్రీ లాంటి మిగతా ప్లస్‍లతో వచ్చిన ఈ సినిమాలో ఓ స్పష్టమైన కథంటూ లేకపోవడం, కథనం కూడా నీరసంగా సాగడం, అనవసర సన్నివేశాలు, అతిగా కనిపించే కొన్ని యాక్షన్ సీన్స్ మైనస్‍ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా, తారాస్థాయికి చేరిన అంచనాలను అందుకోవడంలో విఫలమైనా, ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడంలో మాత్రం బాగానే మెప్పించిందని చెప్పొచ్చు. పవన్ చరిష్మా కోసమే చూస్తే ఈ సినిమా బాగానే మెప్పిస్తుంది.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

No comments:

Post a Comment