Latest News

Saturday, March 19, 2016

‘చిక్కడు దొరకడు’ సినిమా రివ్యు || Tolly Beats


‘చిక్కడు దొరకడు’ సినిమా రివ్యు || Tolly Beats


Tolly Beats Rating: 4.25/5
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో మెప్పించి హీరోగా స్టార్‌డమ్ కొట్టేసిన సిద్ధార్థ్, గత కొద్దికాలంగా పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితమైపోయారు. ఈ సమయంలో ఆయన తమిళంలో చేసిన ‘జిగర్‌తండా’ అనే సినిమా సూపర్ హిట్‌గా నిలిచి సిద్ధార్థ్‌‌ని తమిళంలోనూ స్టార్‌ని చేసింది. 2014లో తమిళంలో వచ్చిన ఈ సినిమాను అప్పట్నుంచే తెలుగులోనూ డబ్ చేయాలని ప్లాన్ చేస్తూ వస్తున్నా, చివరికది ఇప్పటికీ సాధ్యమైంది. ‘చిక్కడు దొరకడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జిగర్‌తండా’ ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

కార్తీక్ (సిద్ధార్థ్) సినీ దర్శకుడవ్వాలని కలలుగనే ఓ యువకుడు. అవకాశాల కోసం పలు ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూండే సమయంలోనే అతడికి, ఓ నిర్మాత ద్వారా గ్యాంగ్‌స్టర్ కథైతే తప్పక చేస్తానని, అలాంటి కథ ఉంటే చూడమనే సమాధానం వస్తుంది. దీంతో కార్తీక్, ఓ గ్యాంగ్‌స్టర్ కథను తయారుచేసే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే అతడికి ఎటాక్ శేషు (బాబీ సింహా) అనే రౌడీ గురించి తెలుస్తుంది. ప్రాణాలు తీయడమనేది పెద్ద విషయమే కాదనుకునే శేషు పూర్తి కథ తెలుసుకునేందుకు కార్తీక్ కర్నూలు ప్రయాణమవుతాడు.

అక్కడికి చేరుకున్నాక కార్తీక్, శేషు కథను తెలుసుకోవడానికి ఏమేం చేశాడు? శేషు పూర్తి కథ ఎలా తెలుసుకున్నాడూ? తెలుసుకొని ఆ కథతో సినిమా తీశాడా? ఆ సినిమా ఏమైంది? కర్నూలులో కావ్య (లక్ష్మీ మీనన్) అనే అమ్మాయిని ప్రేమించిన కార్తీక్ ప్రేమకథ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఓ బలమైన కొత్తదనమున్న కథను, ఎక్కడా పడిపోకుండా, పూర్తిగా డిఫరెంట్ కామెడీతో తెరకెక్కించాలన్న ఆలోచన, ఆ ఆలోచనను పూర్తి స్థాయి సినిమాగా మార్చగలగడంలో చూపిన ప్రతిభ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ చూడని కొత్త తరహా కథాంశమే కాకుండా, కొత్తదనమున్న కామెడీని కూడా ఈ సినిమాలో చూడొచ్చు. కొన్ని సన్నివేశాలైతే కామెడీలో కూడా ఇంత కొత్తదనం చూపించొచ్చా అన్నట్టుగా ఉన్నాయి. ఇక ఈ స్థాయిలో కామెడీ ఉంటూనే, ఒక సినిమాకు అవసరమైన ఎమోషన్‌ను మిస్ చేయకపోవడం, అదీ కథలో సరిగ్గా కలిసిపోయి ఉండడం కట్టిపడేసే అంశంగా చెప్పుకోవచ్చు.

పాత్రల చిత్రణ కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. శేషు పాత్ర సినిమాకే మేజర్ హైలైట్. ఇలాంటి భయానక పాత్రతో ఈ రేంజ్‌లో నవ్వించొచ్చా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలో నటించిన బాబీ సింహా నటన గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే! అతడు కనిపించే ప్రతీ ఫ్రేం కట్టిపడేసేలా ఉంది. హీరో సిద్ధార్థ్ తన పాత్రను అలవోకగా చేసుకుపోయాడు. ఇక లక్ష్మీ మీనన్ కూడా చాలా బాగా చేసింది. మిగతా పాత్రధారులంతా ఎవరికి వారే తమ పాత్రల్లో బాగా నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే, ఈ సినిమాకు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కార్డ్ పడేవరకూ వచ్చే సన్నివేశాలను హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్‌లో మేకింగ్ పరంగా చూపిన ప్రతిభ అద్భుతమనే అనాలి. ఇక సెకండాఫ్‌‌ మొత్తం పూర్తి స్థాయిలో నవ్విస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా మెప్పిస్తూ నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే సినిమా మొత్తం పూర్తిగా ఒక ప్రత్యేక మూడ్‌ను కలిగి ఉండడాన్ని చెప్పుకోవచ్చు. ఈ తరహా సినిమాలు తెలుగులో చాలా తక్కువ. పూర్తిగా కమర్షియల్ సినిమాలనే ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. అదేవిధంగా ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్‌కి ముందు, సెకండాఫ్‌లో వచ్చే మాస్టర్-స్టూడెంట్ ఎపిసోడ్ కొంత బోరింగ్ అనిపించాయి. కొన్నిచోట్ల లాజిక్‌లను పక్కనపెట్టేశారు. ఇకపోతే తెలుగు డబ్బింగ్ విషయంలో విజువల్స్ పరంగా అన్ని మార్పులూ చేసుకున్నా, ప్రధాన పాత్రలకు తప్పించి డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడినట్లు కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమా అన్నివిధాలా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ముందుగా దర్శక, రచయిత కార్తీక్ సుబ్బరాజు గురించి మాట్లాడుకుంటే.. ఒక కొత్త కథను ఎంచుకొని, దానికి మరింత కొత్తదనమున్న సన్నివేశాలను పేర్చి, కావాల్సినంత ఎమోషన్‌ను సినిమా మొత్తం నిలబెడుతూనే చివరివరకూ నవ్వించేలా కార్తీక్ రాసుకున్న స్క్రీన్‌ప్లేను అభినందించకుండా ఉండలేం! దర్శకుడిగానూ ప్రతీ పదినిమిషాలకు ఓ ప్రయోగంతో కార్తీక్ కట్టిపడేశాడు. ఇలాంటి ప్రయోగాలన్నీ కలిపి సినిమాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెట్టాయి. ఏదో కొత్త విషయం చెప్పాలన్న ఆరాటం ప్రతీ ఫ్రేం‍లో కనిపిస్తూంటుంది.

గేవ్ మిక్ యూ ఆరి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ను సరిగ్గా క్యారీ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్ సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో చాలాచోట్ల ప్రయోగాలున్నాయి. వివేక్ హర్షణ్ ఎడిటింగ్‌కి ఎక్కడా వంక పెట్టలేం. ఎడిటింగ్ పరంగానూ సినిమాలో చాలాచోట్ల ప్రయోగాలు చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ వర్క్ ఫర్వాలేదనేలా ఉంది. వెన్నెల కంటి అందించిన మాటలు బాగున్నాయి.

తీర్పు :

కామెడీ అనేది సీజన్, ట్రెండ్‌తో సంబంధం లేని ఓ బలమైన జానర్! ఆ జానర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఆకట్టుకునేలా ఉందన్న ఒక్క మాట చాలు.. సినిమాను ఏ స్థాయికైనా తీసుకెళుతుంది. అలాంటి కామెడీకి కొత్తదనం, పెద్దగా ఎప్పుడూ చూడని నేపథ్యం కలిపి చేసిన ప్రయోగమే ‘చిక్కడు దొరకడు’. బాబీ సింహా అద్భుతమైన నటన, సిద్ధార్థ్ బ్రాండ్, డిఫరెంట్ కామెడీ, కొత్త కథ, నేపథ్యం, ఆలోచన.. ఇలా ఇన్ని ప్లస్ పాయింట్స్ నింపుకున్న ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్‌కి ముందు కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు, సెకండాఫ్‌లో కొన్నిచోట్ల రిపీట్ అయినట్లనిపించే సన్నివేశాల్లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏదైనా కొత్తగా చెప్తే చూడాలనుకునేవారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. సాధారణ సినిమాగా చూసినా కూడా మెప్పిస్తుంది.
చివరిమాట : ఎప్పుడో రెండు సంవత్సరాల క్రిందట విడుదలైన ఈ సినిమా, ఇన్నాళ్ళకు తెలుగులో, అదీ డబ్బింగ్ వర్క్‌లో కొంత అలసత్వం చూపించి, ఏమాత్రం క్రేజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రావడమే అన్నింటికీ మించి ఈ సినిమాకు ప్రతికూలంగా కనిపించే అంశం!

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

No comments:

Post a Comment